Corona Virus: కరోనా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం: బిహార్ సీఎం
- బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తాం
- కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం
- భారత్–నేపాల్ సరిహద్దుల్లో 49 స్క్రీనింగ్ సెంటర్లు–నితీశ్ కుమార్
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తమ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారందరికీ వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ‘ముఖ్యమంత్రి చికిత్స సహాయత కోశక్ష యోజన’కింద కరోనా బాధితులకు చికిత్స అందిస్తామని చెప్పారు. అలాగే, కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం కూడా ఇస్తామని సోమవారం అసెంబ్లీలో తెలిపారు. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందిస్తామని చెప్పారు.
వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవగాహనే కీలకం అన్న సీఎం.. కరోనా బాధితుల సంఖ్య పెరగడం చూసి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలోకి కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు భారత్–నేపాల్ సరిహద్దుల్లోని 49 ప్రాంతాల్లో స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు అసెంబ్లీలో నితీశ్ తెలిపారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా బిహార్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.