Hyderabad: మాకు ఆర్థిక నష్టం కంటే... ప్రజల ఆరోగ్యం ముఖ్యం: సినీ నిర్మాత సురేశ్ బాబు
- అందుకే థియేటర్ల మూసివేతను స్వాగతిస్తున్నాం
- సినిమా హాళ్ల అద్దె, నిర్వహణ ఖర్చులు అధికమే
- అనుబంధ వ్యాపారులకూ కష్టాలు తప్పవు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లను మూసివేయాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్వాగతించారు.
'ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మాకు ఆర్థికంగా తీవ్ర నష్టం అన్నది వాస్తవమే. ఎందుకంటే పదిహేను రోజులపాటు థియేటర్లు నడపకపోయినా అద్దెలు చెల్లించుకోవాలి. పన్నులు, విద్యుత్, ఇతర నిర్వహణ ఖర్చులు భరించాలి. దీనివల్ల ఆర్థికంగా చాలా భారాన్ని మోయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరికాదు కదా. ఇటువంటి కష్టాలు ఏ పది పదిహేనేళ్లకోసారి వస్తుంటాయి. ఇటువంటి సందర్భాల్లో శత్రువు (కరోనా) పై మనమంతా సమష్టిగా యుద్ధం చేయక తప్పదు' అని ఆయన వ్యాఖ్యానించారు.
మూసివేసిన కాలంలో థియేటర్లలో చిరు తిళ్లు, డ్రింక్స్ వంటి వ్యాపారులకు పని ఉండదని, క్యూబ్ డిజిటల్ వాళ్లు ఖాళీగా కూర్చోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇవన్నీ తెలిసిన సమస్యలేనన్నారు. ఇటువంటి సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సామాజిక ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని సురేశ్ బాబు అన్నారు.