Additional Collector: హిజ్రాల దూకుడుతో హడలిపోయిన అదనపు కలెక్టర్!

  • ఇటీవలే రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గా వచ్చిన అంజయ్య
  • డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలన కోసం ఎల్లారెడ్డిపేట పర్యటన
  • రూ.5,116 ఇవ్వాలంటూ అంజయ్యను డిమాండ్ చేసిన హిజ్రాలు
డబుల్ బెడ్ రూం ఇళ్లు పరిశీలించడానికి వెళ్లిన ఓ అడిషనల్ కలెక్టర్ ను హిజ్రాలు బాగా ఇబ్బంది పెట్టిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. సివిల్ సర్వీసెస్ అధికారి అంజయ్య ఇటీవలే రాజన్న సిరిసిల్ల జిల్లాకు అదనపు కలెక్టర్ గా వచ్చారు. ఎల్లారెడ్డిపేటలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లారు. కలెక్టర్ రాకతో అక్కడికి వచ్చిన నలుగురు హిజ్రాలు డబ్బులు ఇవ్వాలని అడిగారు. అడిషనల్ కలెక్టర్ అంజయ్య తన పర్సు తీసి భారీగానే ముట్టచెప్పారు.

అయితే ఆ హిజ్రాలు అంతటితో సంతృప్తి చెందకుండా తమకు ఐదువేల నూట పదహార్లు (రూ.5,116) ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, డబ్బిచ్చే వరకు ఆయనను కదలివ్వబోమని భీష్మించుకున్నారు. హిజ్రాల ధాటికి హడలిపోయిన అడిషనల్ కలెక్టర్ అంజయ్య డబుల్ బెడ్ రూం ఇంటిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పరిస్థితిని గమనించిన రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల వచ్చి  మందలించడంతో హిజ్రాలు అక్కడ్నించి వెళ్లిపోయారు. దాంతో ఊపిరి పీల్చుకున్న అడిషనల్ కలెక్టర్ అంజయ్య డబుల్ బెడ్ రూం ఇంటిలోంచి వెలుపలికి వచ్చారు.
Additional Collector
Anjaiah
Hijras
Rajanna Sircilla District

More Telugu News