Corona Virus: కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తొలి రోజు నుంచి... జరిగేది ఇదే!
- ఐదు రోజుల తరువాత కనిపించే లక్షణాలు
- పది రోజులు దాటేసరికి ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్
- ఆపై రక్తంలోకి పాకి ప్రాణాపాయ స్థితి
ప్రపంచాన్ని భయ కంపితులను చేస్తున్న కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన తొలి రోజు నుంచి ఎటువంటి మార్పులు కనిపిస్తాయి? ఎలాంటి ప్రభావం కనిపిస్తుందన్న అంశాలపై లాన్సెట్ జర్నల్ లో ఓ ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందులోని వివరాల ప్రకారం, ఈ వైరస్ సోకిన తరువాత తొలి ఐదు రోజులూ ఎటువంటి లక్షణాలూ బయటకు కనిపించవు. కొందరిలో 14 రోజుల పాటు ఏ మార్పులూ నమోదు కావు. ఒకసారి ప్రభావం కనిపించడం ప్రారంభమైన తరువాత...
తొలి మూడు రోజులు ఒళ్లు వెచ్చబడుతుంది. ఆపై గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తాయి. 80 శాతం మంది కరోనా వైరస్ సోకిన వారిలో తొలుత ఈ లక్షణాలే కనిపించాయి. ఇక, నాలుగో రోజు నుంచి తొమ్మిదో రోజు లోగా, వైరస్ ప్రభావం ఊపిరితిత్తులపై పడి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. జ్వరం కూడా పెరుగుతుంది. ఊపిరి అందడం కష్టం కావడంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. బాధితుల్లో ఈ దశను ఎదుర్కొన్న వారు 14 శాతం మంది.
ఆపై పదిహేనవ రోజు వచ్చేసరికి ఊపిరితిత్తుల్లోని ఇన్ ఫెక్షన్ రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఆ స్థితికి బాధితుడు చేరుకుంటే, తదుపరి రెండు వారాల పాటు అత్యంత కీలకం. అతని ప్రాణాలను కాపాడుకోవాలంటే, ప్రత్యేక వైద్యం, ఇంటె న్సివ్ కేర్ చికిత్స తప్పనిసరి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారికి ఈ పరిస్థితికి వచ్చిన వారు 5 శాతం వరకూ ఉన్నారు. ఇక వీరిలో రోగ నిరోధక శక్తి బాగుండి, ఇతర జబ్బులు లేకుంటే, కరోనాను సులువుగా జయించవచ్చు. బీపీ, షుగర్, గుండె జబ్బులు తదితరాలు ఉన్నా, 60 ఏళ్లు దాటినా కరోనా వారికి పెనుముప్పుగానే పరిణమిస్తుంది.