Chandrababu: 151 సెక్షన్ ను నాకే ఉపయోగించి నన్ను అరెస్ట్ చేసిన వ్యక్తులు మీరు: చంద్రబాబు

TDP chief Chandrababu slams state police and DGP
  • పోలీసులు పోలీసుల్లా పనిచేస్తున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు
  • ఈ డీజీపీకి విశ్వసనీయత ఉందా అంటూ విమర్శనాస్త్రాలు
  • వ్యక్తి సేవ మానాలని హితవు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పోలీసులపై విమర్శలు చేశారు. పోలీసులు పోలీసుల్లా పనిచేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. 151 సెక్షన్ ను నాకే ఉపయోగించి నన్ను అరెస్ట్ చేసిన వ్యక్తులు మీరు... మీ వద్దకు సామాన్యులు వచ్చే పరిస్థితి ఉందా? అంటూ ప్రశ్నించారు. ఎప్పుడన్నా ఓ డీజీపీ కోర్టుకెళ్లడం గానీ, 6 గంటల పాటు కోర్టులోనే ఉన్న ఆయన ఎదుట 151 సెక్షన్ ను చదివించిన సందర్భం గానీ ఏదైనా ఉందేమో చెప్పండి అంటూ నిలదీశారు. అఫిడవిట్ వేసిన తర్వాత ఇది రైటా, రాంగా అంటే తప్పు అని ఒప్పుకున్న డీజీపీ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? అంటూ సూటిగా అడిగారు.

"ఈయన ఒక డీజీపీనా, ఈయనకు ఓ విశ్వసనీయత ఉందా? అందుకే నేను పోలీసు టెర్రరిజం అంటున్నాను. వీళ్లందరూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ప్రజా రక్షకులుగా నిలబడండి, ప్రజా భక్షకులుగా నిలబడొద్దు. మీరు చేయాల్సింది సమాజసేవ, ఒక వ్యక్తికి ఊడిగం చేయడం కాదు. మాచర్ల నిందితులపై 307 సెక్షన్ నమోదు చేస్తామని ఐజీ చెప్పారు, ఇప్పుడు స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలి. కథలు చెప్పడం ఇకనైనా మానండి. అడిగేవాళ్లు లేరని తమాషాలు పడుతున్నారా? పోలీసులపై నమ్మకం పోయి, నాడు సిపాయిల తిరుగుబాటు ఎలా వచ్చిందో మళ్లీ అలాంటి తిరుగుబాటే వస్తుంది" అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Chandrababu
Police
DGP
Andhra Pradesh
Telugudesam
Local Body Polls

More Telugu News