Corona Virus: ఉద్యోగికి కరోనా లక్షణాలు.. బెంగళూరులో తమ సంస్థ భవనాన్ని ఖాళీ చేయించిన ఇన్ఫోసిస్

Infosys Evacuates Bengaluru Building Amid Coronavirus Scare

  • కరోనా బాధితుడిని సదరు ఉద్యోగి కలిసినట్టు అనుమానం
  • ముందు జాగ్రత్తలో భాగంగా ఐఐపీఎం కార్యాలయం ఖాళీ
  • కర్ణాటకలో ఆరుగురికి కరోనా.. అందులో ముగ్గురు ఐటీ ఉద్యోగులే

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బెంగళూరులోని తమ శాటిలైట్ కార్యాలయాల్లో ఒక భవనాన్ని ఖాళీ చేయించింది. సంస్థకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ పని చేసినట్టు ఇన్ఫోసిస్ ధ్రువీకరించింది. ఆ ప్రాంగణాన్ని మొత్తం శుభ్ర పరుస్తామని చెప్పింది.

 సదరు ఉద్యోగి.. కరోనా బాధితుడిని కలిసినట్టు అనుమానిస్తున్నారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తమ ఐఐపీఎం కార్యాలయాన్ని ఖాళీ చేయించామని ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్ పాండే వెల్లడించారు. ఈ విషయంలో ఉద్యోగులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని తమ ఉద్యోగులకు సంస్థ విజ్ఞప్తి చేసింది.

 కాగా, కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా బెంగళూరులోని అన్ని ఐటీ, బయోటెక్ సంస్థలు వారం రోజుల పాటు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే సౌకర్యాన్ని కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. కర్ణాటకలో ఇప్పటికి ఆరుగురికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా, అందులో ముగ్గురు ఐటీ సెక్టార్‌‌లో పని చేస్తున్న వారే కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News