Chandrababu: సీఎం జగన్​, మంత్రి పెద్దిరెడ్డిలపై ‘దిశ’ కింద కేసులు పెట్టాలి: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

Chandrababau Naidu severe comments on Jagan

  • ‘స్థానిక’ ఎన్నికల్లో మా అభ్యర్థులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు
  • మహిళలపైనా దారుణంగా వ్యవహరిస్తున్నారు
  • ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా?

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని, మహిళలపైనా దారుణంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోనీ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంత దారుణం జరుగుతున్నా సీఎం జగన్, హోం మంత్రి సుచరిత, ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా? అని ప్రశ్నించిన చంద్రబాబు, దిశ చట్టం కింద సీఎం, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డిపై కేసులు పెడితే గానీ వారికి బుద్ధిరాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ప్రత్యర్థుల ఇళ్లలో మద్యం బాటిల్స్ పెడుతున్నారని ఆరోపించారు. తెనాలిలో నాల్గో వార్డు అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అడుసుమిల్లి వెంకటేశ్వరరావు ఇంటి గోడ దూకి ఓ వ్యక్తి వెళ్లాడని, మేడ పైన ట్యాంక్ దగ్గరకు వెళ్లి మద్యం బాటిల్స్ ఉన్న అట్టపెట్టెను అక్కడ పెట్టి వచ్చాడని ఆరోపించిన బాబు, ఇందుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు.  

తిరుపతిలో టీడీపీ నేత కామేశ్ యాదవ్ ఇంట్లో కూడా మద్యం సీసాలు ఉన్నాయని ఆందోళన చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలు మహిళలపై అరాచకాలు చేస్తున్నారని, పుంగనూరులో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళను అడ్డుకున్నారని, మామూలు దుస్తుల్లో వెళితే గుర్తుపట్టి అడ్డుకుంటారని బురఖా ధరించి వెళ్లినా ఆమెను అడ్డుకున్నారని మండిపడ్డారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన మరో మహిళపైనా వైసీపీ నేతలు దుర్మార్గంగా ప్రవర్తించారని, ఆమె తన రవికెలో దాచుకున్న నామినేషన్ పత్రాలను సైతం లాక్కునే యత్నం చేశారని ధ్వజమెత్తారు. ధర్మవరంలో మహిళ నామినేషన్ పత్రాలు లాక్కున్నారని, రాయచోటిలో మైనార్టీ వ్యక్తి నామినేషన్ పత్రాలు లాక్కున్నారని, పోలీసుల ముందే వైసీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News