Ke prabhaker: టీడీపీపై కార్యకర్తలకు నమ్మకం సన్నగిల్లుతోంది: కేఈ ప్రభాకర్​

KE Prabhaker interesting comments on TDP

  • ‘స్థానిక’ ఎన్నికల్లో సీనియర్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది
  • కొత్తగా వచ్చిన వ్యక్తులు తమ వాళ్లకు టికెట్లు ఇప్పించుకుంటున్నారు
  • స్థానిక బీజేపీ నేతలు టీడీపీపై పెత్తనం చెలాయిస్తున్నారు

కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్లు లభించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడారు. టీడీపీకి ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలను బయటపెట్టారు.

టీడీపీకి కార్యకర్తల అండదండలు గతంలో ఉండేవని, ఈ మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీపై కార్యకర్తలకు నమ్మకం సన్నగిల్లుతోందని అన్నారు. వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడిందని స్పష్టం చేశారు. ‘స్థానిక’ ఎన్నికలకు సంబంధించి చాలామంది కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తులు తమ వాళ్లకు టికెట్లు ఇప్పించుకుంటున్నారని విమర్శించారు. దీంతో, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎంతగానో ఆవేదన చెందుతున్నారని అన్నారు.

పార్టీకి రాజీనామా చేసే ముందు కేఈ కృష్ణమూర్తితో మాట్లాడారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘మీరు మాట్లాడితే బాగుంటుంది‘ అంటూ చమత్కరించారు. స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు తమకు డబ్బుందన్న అహంకారంతో టీడీపీ నేతలపై పెత్తనం చెలాయించడం తనకు నచ్చలేదని, కర్నూలు జిల్లాలో టీడీపీ లేకుండా చేయాలనేది వారి ఉద్దేశమని, ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తెలుసుకుంటే బాగుంటుందని చెప్పారు.

కోట్ల, మేము ఒకే పార్టీలో ఉండటం మంచిది కాదు
 
కోట్ల వర్గం ఏ రోజైతే టీడీపీలో చేరిందో, ఆరోజే  ఆ పార్టీని తాము వీడితే బాగుండేదని కేఈ ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. పైస్థాయిలో నాయకులు కలిస్తే సరిపోదని, కిందిస్థాయిలో కార్యకర్తలు కూడా కలవాలని సూచించారు. కోట్ల కుటుంబం, తమ కుటుంబం ఒకే పార్టీలో ఉండటం మంచిది కాదని, అందుకే, తాను పార్టీ వీడానని చెప్పారు.

  • Loading...

More Telugu News