Delhi Restaurant: సంప్రదాయ దుస్తులతో వచ్చిన మహిళను అనుమతించని ఢిల్లీ రెస్టారెంట్!

Delhi Restaurant Gets Flak On Denying Entry To Customer In Ethnic Wear

  • వీడియో తీసి ట్విట్టర్‌‌లో షేర్ చేసిన మహిళ
  • రెస్టారెంట్ తీరుపై మండిపడ్డ నెటిజన్లు 
  • దిగొచ్చి క్షమాపణ చెప్పిన యాజమాన్యం

సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళకు ప్రవేశాన్ని నిరాకరించిన ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ వార్తల్లో నిలిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఢిల్లీ వసంత్ కుంజ్‌లోని ఆంబియెన్స్‌ మాల్‌లో ఉన్న కైలిన్ అండ్ ఇవీ రెస్టారెంట్‌కు వెళ్లిన సంగీత నాగ్ అనే మహిళకు చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్‌ సిబ్బంది ఆమెను లోనికి అనుమతించలేదు. ఎందుకని అని అడిగితే భారత సంప్రదాయ దుస్తులు ధరించిన వారికి తమ రెస్టారెంట్‌లోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కంగుతిన్నారు.

 ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఈ ఘటనను వీడియో తీసిన ఆమె తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘కైలిన్ అండ్ ఇవీ రెస్టారెంట్‌ వద్ద నాకు ఎదురైన అనూహ్య అనుభవం, వివక్ష ఇది. సంప్రదాయ దుస్తులు ధరించినందుకు నన్ను రెస్టారెంట్‌లోకి అనుమతించలేదు. ఇండియాలో ఓ రెస్టారెంట్‌ స్మార్ట్‌ క్యాజువల్స్‌కు అనుమతిస్తుంది కానీ, ఇండియన్‌ వేర్‌‌కు ఇవ్వదా? భారతీయులు గర్వంగా ఉండడానికి ఏం అవుతోంది?’ అని ట్వీట్‌ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. సంగీతకు నెటిజన్లు మద్దతు ప్రకటించారు. సదరు రెస్టారెంట్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. దాంతో, రెస్టారెంట్ యాజమాన్యం దిగొచ్చింది. జరిగిన ఘటనపై సంగీతకు క్షమాపణ చెప్పింది.

  • Loading...

More Telugu News