Corona Virus: కరోనాతో వణుకుతున్న యూరప్​.. ​ 70 శాతం కొత్త కేసులు అక్కడే!

70 percent new Corona cases in Europe
  • ఇటలీలో అత్యంత ప్రమాదకరంగా పరిస్థితి
  • ఒక్క రోజే 189 మంది మృతి.. కొత్తగా మూడు వేల మందికి వైరస్
  • స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాల్లోనూ పెరుగుతున్న కేసులు
చైనాలో వ్యాప్తి చెందడం మొదలైన కరోనా వైరస్ యూరప్ దేశాలను గడగడలాడిస్తోంది. మొదట్లో దక్షిణ కొరియా, ఇరాన్, ఇతర ఆసియా దేశాల్లో ప్రభావం చూపినా.. యూరప్ దేశాల్లో మాత్రం ఆందోళనకరమైన రీతిలో వ్యాప్తి చెందుతోంది. ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, బెల్జియం తదితర దేశాలు హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించాయి. ఇటలీలో అయితే వైరస్ మృతుల సంఖ్య ఏకంగా వెయ్యిని దాటేసింది. యూరప్ దేశాల స్థాయిలో కాకున్నా ఆసియా ఖండంలోని ఇతర దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది.

చైనాలో ఆంక్షల సడలింపు

చైనాలో కరోనా వైరస్ పరిస్థితి చాలా వరకు కుదుటపడింది. ఇప్పటివరకు 80 వేల మందికిపైగా కరోనా వైరస్ సోకినా.. కొత్తగా గురువారం అర్ధరాత్రి వరకు గుర్తించిన కేసులు ఎనిమిది మాత్రమే. మరో ఏడుగురు మరణించడంతో మొత్తంగా చైనాలో కరోనా మరణాల సంఖ్య 3,176కు చేరింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో వూహాన్ లో ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను సడలించారు.

కొరియాలోనూ దారికొస్తోంది

అటు దక్షిణ కొరియాలో కొత్తగా వైరస్ సోకుతున్నవారి సంఖ్య బాగా తగ్గింది. గురువారం కొత్తగా 110 మందికి వైరస్ సోకగా.. ఇప్పటికే వచ్చినవారిలో 177 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఈ దేశంలో ఇప్పటివరకు 7,979 మందికి వైరస్ సోకగా.. చనిపోయినవారి సంఖ్య 67కు చేరింది.

ఇరాన్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. వేలాది మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు 429 మంది మరణించారు. ఖతార్ లోనూ 262 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో విద్యా సంస్థలను మూసివేశారు. గల్ఫ్ దేశాల్లోనూ వైరస్ వ్యాపిస్తున్నా పూర్తి స్థాయిలో గణాంకాలను విడుదల చేయడం లేదు.

యూరప్ లో మాత్రం ఆందోళనకరంగా..

  • చైనా, దక్షిణ కొరియా, ఇతర ఆసియా దేశాల్లో వైరస్ ప్రభావం తగ్గుతుండగా యూరప్ దేశాల్లో మాత్రం పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఆసియా దేశాలతో పోలిస్తే యూరప్ దేశాల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
  • ఇటలీలో ఇప్పటివరకు 15 వేల మందికిపైగా వైరస్ బారినపడగా అందులో గురువారం ఒక్క రోజే 2,651 మందికి సోకింది. ఒక్క రోజే 189 మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 1,016కు చేరింది. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో చైనా వైద్య బృందం సహాయం తీసుకుంటున్నారు.
  • స్పెయిన్ లో వైరస్ ఉద్ధృతి పెరుగుతుండటంతో దేశంలో చాలా ప్రాంతాలను క్వారంటైన్ చేశారు. ఓ మంత్రికి వైరస్ రావడంతో ప్రజాప్రతినిధులకు టెస్టులు చేశారు.
  • బెల్జియం, రోమ్ లలో చర్చీలను మూసివేశారు. రెండు వారాల పాటు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది.
  • అటు బ్రిటన్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనాను ప్రజారోగ్య సంక్షోభంగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

Corona Virus
Europe
Italy
Spain
COVID-19
China
South koria

More Telugu News