ICC: కరోనా ఎఫెక్ట్... ఐసీసీ టెలికాన్ఫరెన్స్!
- సభ్యదేశాల విజ్ఞప్తి మేరకు నిర్ణయం
- కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో భయం
- అధికారికంగా ప్రకటించిన ఐసీసీ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (కోవిడ్ 19) ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. తాజాగా ఈ నెలాఖరులో జరగాల్సిన తమ సమావేశాన్ని కూడా 'కాన్ఫరెన్స్ కాల్' లోనే నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించడం గమనార్హం. సభ్య దేశాల విజ్ఞప్తి మేరకు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు జరగాల్సిన బోర్డు సమావేశాన్ని కూడా ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. 'కరోనా భయం నేపథ్యంలో సభ్యదేశాల విజ్ఞప్తిని గౌరవిస్తున్నాం. వారి ఆరోగ్య భద్రతే మాకు ముఖ్యం. అందుకే టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. అది కూడా ముఖ్యమైన విషయాలు మాత్రమే చర్చిస్తాం' అని తన ప్రకటనలో ఐసీసీ పేర్కొంది. ఈనెల 3న జరగాల్సిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం కూడా వాయిదాపడిన విషయం తెలిసిందే.