Visakhapatnam District: ఇటలీ, సింగపూర్ నుంచి రాక... కరోనా అనుమానంతో ఆసుపత్రిలో చేరిక.. స్థానికుల్లో కలకలం!

corono suspects create tension

  • విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలో కలకలం 
  • నగరంలోని చెస్ట్ ఆసుపత్రిలో ప్రత్యేక పరీక్షలు 
  • ఆందోళన చెందుతున్న స్థానిక జనం

ఒకరు ఇటలీ నుంచి వచ్చారు. మరొకాయన సింగపూర్ నుంచి దిగారు. ఇద్దరికీ విమానాశ్రయంలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. వ్యాధి లక్షణాలు లేవని తేలడంతో పంపించేశారు. ఇళ్లకు వచ్చాక కొన్నాళ్లకు ఇద్దరికీ దగ్గు తగ్గక పోవడంతో అనుమానంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అంతే.. ఈ వార్త కాస్త అటూఇటూ వ్యాపించడంతో ప్రస్తుతం విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలో కలకలం మొదలయ్యింది.

వివరాల్లోకి వెళితే... అనకాపల్లి శారదా కాలనీకి చెందిన కృష్ణభరద్వాజ్ ఇటలీలో చదువుకుంటున్నాడు. అక్కడ కరోనా కలకలం ఎక్కువ కావడంతో ఇటీవల స్వగ్రామానికి వచ్చేశాడు. విమానాశ్రయం టెస్ట్ ల్లో నెగెటివ్ వచ్చింది. కానీ ఇంటికి వచ్చిన కొన్నాళ్లకు దగ్గు వస్తుండడంతో కుటుంబ సభ్యులు విశాఖలోని చెస్ట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అతనికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు తేల్చిచెప్పారు.

కానీ జీవీఎంసీ అధికారులు వెంటనే శారదా కాలనీకి వెళ్లి అవసరమైన మందులు పిచికారీ చేయించి, ముందు జాగ్రత్తలు తెలియజేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అలాగే, రావికమతం మండలానికి చెందిన ఎం,కుమార్ అనే యువకుడు ఇటీవల సింగపూర్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. వచ్చిన కొన్ని రోజులకు దగ్గు వస్తుండడంతో అనకాపల్లిలోని ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షించి కరోనా లక్షణాల్లేవని, కేవలం అనుమానం మాత్రమేనని తేల్చారు.

కానీ ఎందుకైనా మంచిదని అతన్ని విశాఖ చెస్ట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అనకాపల్లి ప్రాంతానికి చెందిన వీరిద్దరూ ప్రస్తుతం విశాఖ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్న వార్త స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైద్యులు వారికి లక్షణాల్లేవని చెబుతున్నా అనుమానంతో భయపడుతున్నారు.

  • Loading...

More Telugu News