YSRCP: వైసీపీకి పదేళ్లు... నేడు ఆవిర్భావ వేడుకలు!
- నేడు ఆవిర్భావ దినోత్సవం
- విశాఖలో ప్రత్యేక ఉత్సవం
- పార్టీలో చేరనున్న కరణం బలరాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) నేటితో 9 సంవత్సరాలు నిండి 10వ వసంతంలోకి అడుగిడనుంది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరిపేందుకు వైకాపా శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
వాస్తవానికి వైఎస్ఆర్ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది యెడుగింటి సందింటి రాజశేఖర రెడ్డి... అలియాస్ వైఎస్ రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా, రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఏపీలో అధికారంలోకి తీసుకుని వచ్చి, ముఖ్యమంత్రిగా, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు దగ్గర చేసిన నేతగా, ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని పొందిన నాయకుడు.
ఆయన పేరు కలిసి వచ్చేలా అప్పటికే కే శివకుమార్ అనే వ్యక్తి రిజిస్టర్ చేయించుకున్న 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'లో చేరిన జగన్, దానికి తానే అధినేత అయ్యారు. తండ్రి పేరు కలిసి వచ్చేలా ఉండటమే ఇందుకు కారణం. ఆపై 2014లో జరిగిన ఎన్నికల్లో ఒటమి పాలైనా, అలుపెరగక, 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, ప్రజలతో మమేకమై, తన ఆశయాన్ని సాధించుకున్న వ్యక్తి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ చేపట్టి నేటికి తొమ్మిది సంవత్సరాలు నిండి పదో వత్సరం వచ్చేసింది. అంటే... ఇవి పార్టీ ఆవిర్భావ వేడుకలు. నేడు విశాఖపట్నంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరిపేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ జరిగే వేడుకల్లోనే తెలుగుదేశం పార్టీలో గతంలో తిరుగులేని నేతగా పేరొందిన ప్రకాశం జిల్లా నాయకుడు కరణం బలరాం వైసీపీలో చేరుతారని తెలుస్తోంది.