Corona Virus: ఇది ప్రపంచ మహమ్మారే... కరోనాపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారిక ప్రకటన!

WHO Declares Corona as Pandemic

  • 4,291 మంది చనిపోయారు
  • 114 దేశాలకు విస్తరించింది
  • 2009లో స్వైన్ ఫ్లూను మహమ్మారిగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
  • ఆపై కరోనాకే ఆ స్థాయి గుర్తింపు

దాదాపు 110 దేశాలకు విస్తరించిన కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రపంచ మహమ్మారేనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. చైనాలో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత, ఇటలీ, ఇరాన్ తదితర దేశాల్లో తొలి మరణాలు సంభవించిన తరువాత కూడా... కరోనాను ప్రపంచ వ్యాధిగా గుర్తించేందుకు నిరాకరించిన డబ్ల్యూహెచ్ఓ, ఇప్పుడు మనసు మార్చుకుంది. "కరోనా వైరస్ ఎంత శరవేగంగా విస్తరిస్తూ, ప్రమాద ఘంటికలను మోగిస్తున్నదో పరిశీలించిన తరువాత, కోవిడ్-19ను మహమ్మారిగా గుర్తిస్తున్నాం" అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అధానోమ్ మీడియాకు వెల్లడించారు.

గత డిసెంబర్ లో చైనాలో తొలిసారిగా కనిపించిన ఈ వైరస్, ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించి, ప్రజల ప్రాణాలను బలిగొనడంతో పాటు ఆర్థిక వృద్ధికీ విఘాతం కలిగించింది. వేలాది విమాన సర్వీసులు నిలిచిపోగా, ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలు, తమ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. పాఠశాలలు మూతపడగా, పలు కీలక ఈవెంట్లు వాయిదా పడ్డాయి.

అంతర్జాతీయ స్థాయిలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని సైతం ప్రకటిస్తున్నట్టు ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. మొత్తం 114 దేశాల్లో 1.18 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకూ 4,291 మంది మరణించారని టీడ్రాస్ వ్యాఖ్యానించారు. ఈ వైరస్ మహమ్మారేనని చెప్పడానికి ఇంతకన్నా మరే నిదర్శనాలూ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 2009లో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ)ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన తరువాత, డబ్ల్యూహెచ్ఓ మరో వ్యాధిని ఇంత తీవ్రంగా పరిగణించడం ఇదే తొలిసారి.

Corona Virus
WHO
Pandemic
  • Error fetching data: Network response was not ok

More Telugu News