Kanna Lakshminarayana: సీఎం జగన్ రాజీనామా చేస్తారో లేక డీజీపీ రాజీనామా చేస్తారో తేల్చుకోవాలి!: కన్నా ఫైర్ ​

Kanna Lakshmi Narayana lashes out Jagan
  • ‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ గూండాల అరాచకాలు  
  • రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోంది
  • ఏపీలో పోలీస్ వ్యవస్థ పనితీరు దారుణంగా ఉంది
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు ప్రశాంత జీవనాన్ని కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం హడావుడిగా చేపట్టిందని, అరాచకాలు, దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్ లు ఇచ్చారని, ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరిస్తున్నారని, వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి ఓటు వేయకపోతే ‘పింఛన్’, ‘ఆరోగ్యశ్రీ’ రావని బెదిరిస్తున్నారని దుమ్మెత్తిపోశారు.

ఈ ముఖ్యమంత్రికి ఉన్న అవలక్షణాల్లో ఇగోయిజం, శాడిజంతో పాటు ఫ్యాక్షనిజం కూడా తోడైందని విమర్శించారు. గతంలో టెండర్లు వేసేటప్పుడు ఫ్యాక్షనిస్టులు దారుణాలు చేయడం చూశాం కానీ, ఈరోజున నామినేషన్లు వేయకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ గూండాలు అరాచకాలకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని ధ్వజమెత్తారు.

ఇక, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. ఇలాంటి పోలీస్ వ్యవస్థ ఉండటం దారుణమని అన్నారు. జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య జరిగి ఇన్ని రోజులవుతున్నా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించిందని అన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని, సీఎం జగన్ రాజీనామా చేస్తారో లేక డీజీపీ గౌతం సవాంగ్ తన పదవికి రాజీనామా చేస్తారో తేల్చుకోవాలని అన్నారు.
Kanna Lakshminarayana
BJP
Jagan
YSRCP

More Telugu News