Rana Kapoor: రాణా కపూర్ కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసుల జారీ
- దేశం విడిచి వెళ్లకుండా సీబీఐ అప్రమత్తం
- డీహెచ్ఎఫ్ఎల్ నుంచి కపూర్ కుటుంబానికి రూ.600 ముడుపులు
- ఎఫ్ఐఆర్‌లో రాణా కుటుంబం, ఐదు కంపెనీలు, ఇతరుల షేర్లు
యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుటుంబ సభ్యులతోపాటు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వద్వాన్, దీరజ్ వద్వాన్‌లు దేశం విడిచి వెళ్లకుండా సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రూ.600 కోట్ల ముడుపులు రాణా కపూర్ కుటుంబానికి అందాయన్న ఆరోపణల నేపథ్యంలో దీంతో సంబంధం ఉన్న ఏడు ప్రాంతాల్లో నిన్న సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
మరోవైపు, సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో రాణా కపూర్‌తోపాటు ఆయన భార్య బిందు, ముగ్గురు కుమార్తెలు రోష్ని, రాకీ, రాధా సహా మొత్తం ఏడుగురి పేర్లు ఉన్నాయి. కపిల్ వద్వాన్, ఆర్‌కే డబ్ల్యూ డెవలపర్స్ డైరెక్టర్ ధీరజ్ వద్వాన్‌లను నిందితులుగా పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్, ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్, డూఇట్ అర్బన్ వెంచర్స్, ఆర్ఏబీ ఎంటర్‌ప్రైజెస్, మోర్గాన్ క్రెడిట్స్ వంటి ఐదు సంస్థలను ఎఫ్ఐఆర్‌లో చేర్చింది.
కపిల్ వద్వాన్‌తో కలిసి రాణా కపూర్ మోసపూరిత కుట్రకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితుల గృహాలు, అధికారిక కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.