- 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 రన్స్ చేసిన ఆసీస్
- చెలరేగిన ఓపెనర్లు అలీసా హీలీ, బెత్ మూనీ
- భారత బౌలర్లలో దీప్తి శర్మకు రెండు వికెట్లు
మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌కు ఆతిథ్య ఆస్ట్రేలియా 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హీలీ ( 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, బెత్ మూనీ ( 54 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) కూడా దంచికొట్టింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 15 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 16 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.
తొలి వికెట్ఖుకు 115 రన్స్ భాగస్వామ్యం
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు హీలీ, మూనీ ఆటే హైలైట్. ఆరంభం నుంచే చెలరేగిన వీరిద్దరూ తొలి వికెట్ ఏకంగా 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, ఈ ఇద్దరినీ మొదట్లోనే ఔట్ చేసే అవకాశాన్ని చేజార్చిన భారత్ మూల్యం చెల్లించుకుంది. తొలి ఓవర్లోనే హీలీ ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్‌లో షెఫాలీ వర్మ వదిలేసింది. అప్పటికి హీలీ 9 పరుగుల వద్దే ఉంది. అపై నాలుగో ఓవర్లో బెత్ మూనీ 8 పరుగుల ఉన్నప్పుడు ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను రాజేశ్వరి గైక్వాడ్ అందుకోలేకపోయింది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఓపెనర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా క్రీజులో ఉన్నంతసేపు హీలీ భారీ షాట్లతో చెలరేగింది. రాజేశ్వరి వేసిన ఎనిమిదో ఓవరల్ఓ వరుసగా రెండు సిక్సర్లు, శిఖా పాండే వేసిన 11వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో విజృంభించింది. ఈ క్రమంలో టీ20ల్లో ఆమె రెండు వేల పరుగుల మైలురాయి కూడా దాటింది. హీలీ ఔటయ్యాక మూనీ బాదుడు మొదలు పెట్టింది.
చివర్లో పుంజుకున్న బౌలర్లు
హీలీ, మూనీ జోరుతో 11 ఓవర్లకు 114/0తో నిలిచిన ఆసీస్ ఈజీగా 200 మార్కు దాటేలా కనిపించింది. అయితే, 12వ వోర్లో అలీసా హీలీని ఔట్ చేసిన రాధా యాదవ్ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మన బౌలర్లు పుంజుకున్నారు. 17వ ఓవర్లో రెండు వికెట్లు తీసిన దీప్తి శర్మ ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేసింది. 19వ ఓవర్లో రేచల్ హేన్స్ (4)ను పూనయ్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆఖరి ఓవర్లో రాధా యాదవ్ 8 పరుగులే ఇచ్చింది. ఓవరాల్‌గా చివరి 9 ఓవర్లలో 4 వికెట్లు తీసిన భారత బౌలర్లు 70 పరుగులు ఇచ్చారు.