Arunachal Pradesh: విదేశీయులకు ప్రవేశం లేదు: కరోనా విజృంభణ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ కీలక నిర్ణయం
- ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్స్ తాత్కాలికంగా రద్దు
- పీఏపీ ఇష్యూయింగ్ అథారిటీలకు ఆదేశాలు
- విదేశాల నుంచి వస్తోన్న వారి నుంచే కరోనా వ్యాప్తి అంటూ ప్రకటన
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోకి విదేశీయుల రాకను నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్స్ ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పీఏపీ ఇష్యూయింగ్ అథారిటీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్ ఆదేశాలిచ్చారు.
'భారత్‌లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులు పెరిగిపోతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందని తెలుస్తోంది. అలాగే, విదేశాల నుంచి టూర్‌కు వచ్చిన వారి నుంచి ఈ వైరస్ వ్యాప్తిస్తోంది. అందుకే అరుణాచల్ ప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాం. తాత్కాలికంగా పీఏపీను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాం' అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, భారత్‌లో వైరస్ సోకిన వారి సంఖ్య 39కి చేరింది.