Telangana: తెలంగాణలో ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా అనుమానితుడు!
- ఇటీవల దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన మహిపాల్ అనే వ్యక్తి
- తీవ్ర జలుబు, దగ్గుతో ఆసుపత్రిలో చేరిక
- గాంధీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తుండగా అదృశ్యం
కరోనా వ్యాప్తిపై అనవసరంగా ఆందోళన చెందవద్దని ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా ప్రజల్లో భయం తొలగిపోవడంలేదు. తాజాగా తెలంగాణలోని ఓ ఆసుపత్రి నుంచి కరోనా అనుమానితుడు పారిపోయాడన్న విషయం ప్రజల్లో మరింత ఆందోళనకు కారణమైంది. నిర్మల్ జిల్లా ముజిగి గ్రామానికి చెందిన తోట మహిపాల్ అనే వ్యక్తి రెండు వారాల కిందట దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు.
తీవ్రస్థాయిలో జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో మహిపాల్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి ఆసుపత్రి సిబ్బంది మహిపాల్ కు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. నిర్మల్ ఆసుపత్రిలో చేరిన మహిపాల్ ను అక్కడి వైద్యులు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తుండగా, మహిపాల్ అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు కూడా అతని ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.