Tamilnadu: తమిళనాడులో తొలి కరోనా కేసు.... మస్కట్ నుంచి వచ్చి ఆసుపత్రిపాలైన వ్యక్తి
- మార్చి 5న ఆసుపత్రిలో చేరిన 45 ఏళ్ల వ్యక్తి
- కరోనా అనుమానంతో ఐసోలేషన్ వార్డుకు తరలించిన ఆసుపత్రి వర్గాలు
- పుణేలో శాంపిల్స్ పరీక్ష .. కరోనా పాజిటివ్ గా తేలిన వైనం
దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కరోనా అనుమానితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నా, వాటిలో పాజిటివ్ కేసులు వేళ్లమీద లెక్కబెట్టే విధంగానే ఉన్నాయి. తాజాగా, తమిళనాడులో మొట్టమొదటి కరోనా కేసు వెలుగు చూసింది. మస్కట్ నుంచి చెన్నై వచ్చిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది.
జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆ వ్యక్తి మార్చి 5న నగరంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. కరోనా అనుమానితుడిగా భావించి అతడిని ఆసుపత్రి వర్గాలు ఐసోలేషన్ వార్డుకు తరలించాయి. ఆపై అతడి నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా వైద్య పరీక్షల కోసం పుణే పంపారు. ఆ పరీక్షల నివేదిక ఇవాళ వచ్చింది. అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దాంతో ఐసోలేషన్ వార్డులోనే అతడికి చికిత్స కొనసాగిస్తున్నారు. ఆ వ్యక్తి కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచారు.