Telangana: హైదరాబాద్​ చుట్టూ 2 వేల ఎకరాలు ఆక్రమించారు.. కేటీఆర్​ రాజీనామా చేయాలి: తెలంగాణ సీఎల్పీ నేత భట్టి

Bhatti vikramarka demands for KTR Resign

  • కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవడమేంటి?
  • తప్పేం లేకుంటే పోలీసులతో ఎందుకు అడ్డుకున్నారు?
  • దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించిన భట్టి

హైదరాబాద్ చుట్టుపక్కల టీఆర్ఎన్ నేతలు రెండు వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. జీవో నంబర్ 111 నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు కట్టారని, వాటిని ప్రశ్నించినందుకు తమ పార్టీ నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారని చెప్పారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ఇద్దరితో మంత్రి పదవులకు రాజీనామా చేయించాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.

కేటీఆర్ ఫామ్ హౌస్ వైపు వెళ్తుండగా..

హైదరాబాద్ శివార్లలోని జన్వాడలో కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకున్నారంటూ రేవంత్ ఆరోపణలు చేయడం, అక్కడ రేవంత్ అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు వాడారంటూ పోలీసులు ఆయనను అరెస్టు చేయడం తెలిసిందే.

దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ ఫామ్ హౌస్ ను పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం శనివారం సాయంత్రం జన్వాడకు బయలుదేరింది. అయితే పోలీసులు భట్టితోపాటు ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పోదెం వీరయ్య తదితరులను కోకాపేట ప్రాంతంలోనే అరెస్టు చేసి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ భట్టి మీడియాతో మాట్లాడారు.

అక్రమాలు ప్రజలకు తెలియాలి

టీఆర్ఎస్ నేతలు భూములు ఆక్రమించుకున్న విషయం ప్రజలకు తెలియాలని భట్టి అన్నారు. ఫామ్ హౌస్ ప్రాంతానికి వెళ్లకుండా తమను అడ్డుకోవడం ఏమిటని, తప్పేం లేకుంటే ఎవరూ అటు పోనివ్వకుండా కాపాడుకోవాల్సినంత అవసరం ఏముందని ప్రశ్నించారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు ఏవైనా ఉంటే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామన్న కేటీఆర్.. దీనికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.

  • Loading...

More Telugu News