Mitchell Stark: భార్య ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటే వెళ్లిన ఆసీస్ పేసర్... ప్రశంసించిన అశ్విన్
- మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్, భారత్ అమీతుమీ
- ఆసీస్ జట్టుకు ఆడుతున్న అలీసా హీలీ
- భార్య అలీసా హీలీ ఆట చూసేందుకు దక్షిణాఫ్రికా టూర్ నుంచి వచ్చేసిన స్టార్క్
- ఇది జీవితకాలంలో వచ్చే అరుదైన సందర్భమన్న ఆసీస్ మేనేజ్ మెంట్
రేపు టీమిండియా, ఆస్ట్రేలియా మహిళల జట్లు టి20 వరల్డ్ కప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, తన భార్య అలీసా హీలీ ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడుతుండడంతో ఆమె కోసం ఆసీస్ పురుషుల జట్టు పేసర్ మిచెల్ స్టార్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే తప్పుకుని ఆస్ట్రేలియా పయనమయ్యాడు. ప్రపంచకప్ ఫైనల్లో తన భార్య ఆడుతుండగా చూడాలన్నది స్టార్క్ కోరిక. అందుకే జట్టు మేనేజ్ మెంట్ అనుమతి తీసుకుని దక్షిణాఫ్రికా నుంచి మెల్బోర్న్ వచ్చేశాడు.
స్టార్క్ నిర్ణయాన్ని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు. భార్యకు అండగా నిలుస్తూనే, మరోవైపు మహిళల క్రికెట్ కు ప్రోత్సాహాన్నిచ్చేలా స్టార్క్ మంచి నిర్ణయం తీసుకున్నాడని అభినందించాడు. ఆసీస్ జట్టు మేనేజ్ మెంట్ కూడా స్టార్క్ నిర్ణయాన్ని సమర్థించింది. జీవితకాలంలో ఇలాంటి సందర్భాలు ఎంతో అరుదుగా వస్తుంటాయని, స్టార్క్ కు అనుమతి ఇవ్వడంలో తామెలాంటి పునరాలోచన చేయడంలేదని పేర్కొంది.