Hyderabad: కరోనా అలజడి తగ్గుతోంది... గాంధీ ఆసుపత్రికి వస్తున్న కేసులు అంతంతే!
- ప్రస్తుతానికి ఒకే ఒక్క బాధితుడు
- అతని ఆరోగ్యం మెరుగుపడుతోందన్న వైద్యులు
- ఓపీకి వచ్చిన వారి సంఖ్య తగ్గుముఖం
కరోనా కలకలంతో సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఒకే ఒక్క బాధితుడు ఉండగా, అతని ఆరోగ్యం కూడా వేగంగా మెరుగుపడుతోందని వైద్యులు వెల్లడించారు.
నిన్న సాయంత్రం బాధితుడిని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేంద్ర కిటికీ లోంచి పరామర్శించారు. ఫోన్లో అతనితో మాట్లాడారు. వైరస్ సోకిన పది రోజుల తర్వాత అతను వైద్యులను సంప్రదించడంతో అప్పటికే ఊపిరితిత్తులకు న్యుమోనియా సోకింది. అతని కుటుంబ సభ్యులతో పాటు, ఈ పదిరోజుల్లో అతను కలిసిన మరో 88 మందికి ఎటువంటి వైరస్ సోకలేదని నిర్ధారించారు.
ఇక ఆసుపత్రికి అనుమానంతో పరీక్షలకు వచ్చిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. శుక్రవారం కేవలం పది మంది మాత్రమే సాధారణ పరీక్షల కోసం వచ్చారని వైద్యులు తెలిపారు.