Nirmala Sitharaman: ఎస్ బ్యాంకులో పాలనా పరమైన ఇబ్బందులు ఉన్నట్టు గుర్తించాం: నిర్మలా సీతారామన్
- ఇది వ్యవస్థాగత సంక్షోభంగా భావిస్తున్నామన్న కేంద్రమంత్రి
- ఎస్ బ్యాంకు పరిస్థితిపై 2017లోనే కేంద్రం అప్రమత్తమైందని వెల్లడి
- గత ఆర్నెల్లుగా ప్రతి రోజు బ్యాంకు కార్యకలాపాలను పరిశీలిస్తున్నామన్న నిర్మల
ఎస్ బ్యాంకు సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్ బ్యాంకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో శోధించాలని ఆర్బీఐని కోరుతున్నట్టు వెల్లడించారు. సంక్షోభానికి మొదలు, ముగింపు ఏమిటన్నది కూడా ఆర్బీఐ నుంచి నివేదిక తీసుకుంటామని తెలిపారు. ఎస్ బ్యాంక్ పరిస్థితికి కారణాలు ఏమిటన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఎస్ బ్యాంకు సంక్షోభంపై కేంద్రం 2017లోనే అప్రమత్తమైందని వెల్లడించారు. అప్పటి నుంచి బ్యాంకు పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. గత ఆర్నెల్లుగా ప్రతి రోజు బ్యాంకు కార్యకలాపాలను పరిశీలనలో ఉంచామని అన్నారు. ముఖ్యంగా, ఎస్ బ్యాంకులో పాలనాపరమైన ఇబ్బందులు ఉన్నట్టు గుర్తించామని, ఇది వ్యవస్థాగతమైన సంక్షోభంగానే భావిస్తున్నామని చెప్పారు. ఎస్ బ్యాంకును సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, అందుకే ఎస్బీఐ 49 శాతం పెట్టుబడులు పెట్టనుందని వివరించారు.