Bollywood: తానాజీ రికార్డు బ్రేక్ చేసిన భాగీ-3
- రూ. 5.50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన టైగర్ ష్రాఫ్ చిత్రం
- ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక అడ్వాన్స్ భాగీ-3దే
- కలెక్షన్లపై కరోనా ప్రభావం
బాలీవుడ్ లో ఈ ఏడాది భారీ అంచనాలున్న సినిమాల్లో భాగీ-3 ఒకటి. టైగర్ ష్రాఫ్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం విడుదలైంది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చిత్రానికి మంచి ఆరంభం దక్కినట్టు అనిపిస్తోంది.
బాక్సాఫీస్ రికార్డు రిపోర్టు ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే భాగీ-3 ఐదున్నర కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ లెక్కన ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అత్యధిక అడ్వాన్స్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. అడ్వాన్స్ కలెక్షన్లలో అజయ్ దేవగణ్ నటించిన ‘తానాజి’ సినిమా రికార్డును భాగీ-3 దాటేసింది. ‘తానాజి’ రూ. 5.18 కోట్ల అడ్వాన్స్ రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ‘లవ్ ఆజ్ కల్’ రూ. 3.54 కోట్లు, ‘స్ట్రీట్ డ్యాన్సర్’ రూ. 3.39 కోట్లు, ‘శుభ్ మంగల్ జ్యాదా సావ్ ధాన్’ రూ. 3.16 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్లతో టాప్-5లో చోటు దక్కించుకున్నాయి.
కాగా, కరోనా వైరస్ ఆందోళనలు టైగర్ ష్రాఫ్ చిత్రం కలెక్షన్లపై ప్రభావం చూపింది. కరోనా భయంతో మల్టీప్లెక్స్ సేల్స్ బాగా పడిపోయాయి. లేదంటే అడ్వాన్స్ రూపంలోనే భాగీ-3 ఎనిమిది కోట్లు రాబట్టేదని బాలీవుడ్ వర్గాలు చెతున్నాయి. ష్రాఫ్ గత చిత్రం ‘భాగీ-2’ తొలి రోజు రూ. 25 కోట్లు రాబట్టింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే భాగీ-3 అంతకంటే ఎక్కువ మొత్తం కలెక్ట్ చేస్తుందని ప్రముఖ ట్రేడ్ నిపుణుడు తరుణ్ ఆదర్శ్ అంచనా వేస్తున్నారు.