Shilpa Shetty: గోల్డ్ స్కీంలో మోసం చేశారంటూ శిల్పా శెట్టి దంపతులపై ఫిర్యాదు

Shilpa Shetty and Raj Kundra faces police case
  • గోల్డ్ స్కీంలో కిలో బంగారం కొన్న ఎన్నారై
  • గోల్డ్ కార్డు రిడీమ్ చేసుకుంటే మరికొంత బంగారం ఇస్తామన్న కంపెనీ
  • కార్డు మార్చుకుందామని వెళ్లిన ఎన్నారైకి తీవ్ర నిరాశ
  • షట్టర్ మూసేసిన సంస్థ
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు చెందిన ఓ సంస్థ తనను గోల్డ్ స్కీం పేరిట మోసం చేసిందని సచిన్ జోషి అనే ఎన్నారై ముంబయిలోని ఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిల్పా శెట్టి దంపతులకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 2014లో ఓ గోల్డ్ స్కీమ్ ప్రవేశపెట్టిందని, దాంట్లో భాగంగా రూ.18.58 లక్షలతో కిలో బంగారం కొన్నానని సచిన్ జోషి తెలిపారు. ఈ స్కీం  కాలపరిమితి ఐదేళ్లు అని చెప్పారు. కిలో బంగారం కొంటే ఓ గోల్డ్ కార్డ్ ఇచ్చి స్కీం ముగిసిన తర్వాత దాన్ని మార్చుకుంటే (రిడీమ్) కొంత బంగారం ఇస్తామని పేర్కొన్నారని జోషి వివరించారు.

అయితే, స్కీం కాలపరిమితి 2019 మార్చి 25తో ముగిసిందని, తన వద్ద ఉన్న గోల్డ్ కార్డ్ మార్చుకునేందుకు ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న సత్యయుగ్ కంపెనీ కార్యాలయానికి వెళితే అక్కడ 'క్లోజ్డ్' బోర్టు కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కంపెనీ గురించి లోతుగా పరిశోధిస్తే, శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరించారని, అయితే 2016, 2017లో వరుసగా తమ పదవులకు రాజీనామా చేసినట్టు తెలిసిందని వివరించారు. దాంతో మోసపోయానన్న భావన కలిగిందని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
Shilpa Shetty
Raj Kundra
Gold Scheme
Sachin Joshi
Mumbai
Police

More Telugu News