Hollywood: కరోనా దెబ్బకు దుకాణం మూసేసిన హాలీవుడ్!
- చైనా సహా అనేక దేశాల్లో కరోనా విజృంభణ
- హాలీవుడ్ చిత్రాల షూటింగ్ నిలిపివేత
- భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలు వాయిదా
- 5 బిలియన్ డాలర్ల మేర నష్టం
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే ఉత్పాదక రంగం నీరసించింది. తాజాగా, ప్రపంచ వినోద రంగానికి కేంద్ర స్థానమైన హాలీవుడ్ పైనా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తికి జడిసి అనేక హాలీవుడ్ చిత్రాల షూటింగ్ నిలిపివేశారు.
ప్రపంచవ్యాప్తంగా చైనా సహా అనేక దేశాల్లో కరోనా కారణంగా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉండడంతో, హాలీవుడ్ చిత్రాల ప్రదర్శన కూడా ప్రభావితమవుతోంది. పలు హాలీవుడ్ చిత్రాల విడుదల తేదీలను సైతం వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ వేసవిలో రావాల్సిన జేమ్స్ బాండ్ కొత్త చిత్రం విడుదలను నవంబరుకు మార్చారు. కరోనా కారణంగా హాలీవుడ్ కు ఇప్పటివరకు 500 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. భారీ బడ్జెట్ తో తెరకెక్కే హాలీవుడ్ చిత్రాలకు ఇది పెను విఘాతం కానుంది.