Hyderabad: ఈ దొంగ రూటే సెపరేటు.. చోరీ బంగారం దాచింది ఎక్కడో తెలుసా?
- మూసీ పరీవాహకంలో గుంతతీసి పాతి పెట్టిన వైనం
- అవసరమైనప్పుడు ఒక్కో ఆభరణం తీసి అమ్మకం
- ఎట్టకేలకు పాచిక విఫలమై పోలీసులకు చిక్కిన నిందితుడు
చోరీ చేయడం కంటే అహరించిన సొత్తును భద్రపర్చడమే పెద్ద సవాలు. చాలామంది దొంగలు ఇక్కడే విఫలమై పోలీసులకు చిక్కుతుంటారు. ఈ తలనొప్పి ఎందుకనుకున్నాడో ఏమో ఈ దొంగ తాను దొంగిలించిన సొత్తును తెలివిగా చెత్తాచెదారాల్లో కలిపేసి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడు. చివరికి అతని ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు దొరికిపోయాడు.
పోలీసుల తెలిపిన వివరాల్లోకి వెళితే... వనపర్తి పీర్ల కాలనీకి చెందిన పెద్దబూది వంశీ (23) వృత్తి రీత్యా పెయింటర్. బాల్యంలోనే వ్యసనాలకు బానిసై 13 ఏళ్ల వయసులోనే దొంగతనానికి పాల్పడ్డాడు. జువైనల్ హెూంలో శిక్ష కూడా అనుభవించాడు. అయినా తన తీరు మార్చుకోలేదు. ఓ కేసులో చర్లపల్లి జైలులో పెడితే గత ఏడాది డిసెంబరులో విడుదలయ్యాడు.
కుటుంబ సభ్యులు దరిచేరనీయక పోవడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ సమీపంలో ఉండేవాడు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు సమీపంలోని కాలనీల్లో పగటిపూట రెక్కీ నిర్వహించేవాడు. అర్ధరాత్రి ఓ ఇనుపకడ్డీ, స్కూడ్రైవర్ తో ఆ ఇళ్లకు చేరుకుని గెడలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించేవాడు. డబ్బు, బంగారం అహరించాక వాటితో ఎంజీబీఎస్ బస్టాండ్ కు సమీపంలోని మూసీనది ఒడ్డుకు చేరుకునే వాడు.
అక్కడ ఎవరూ పట్టించుకోరు, అటువైపు వెళ్లరన్న ప్రాంతంలో గొయ్యితీసి అందులో బంగారం పాతి పెట్టేసేవాడు. ఆ తర్వాత ఈ గొయ్యి పై చెత్తా చెదారం పడేసేవాడు. తాను గుర్తుపట్టేందుకు వీలుగా ఓ కొండ గుర్తు ఏర్పాటు చేసుకుని వెనక్కి వచ్చేసేవాడు. అవసరమైనప్పుడు అందులో కొంత బంగారాన్ని తీసి షాపుల్లో కాకుండా అపరిచిత వ్యక్తులకు ఎంతకోకొంతకు అమ్మేసి అవసరాలు తీర్చుకునేవాడు.
ఇతను దొంగతనాలు చేసిన పరిసరాల నుంచి పలు కేసులు నమోదు కావడంతో పోలీసులు నిఘా పెట్టారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు తుర్కయాంజాల్ ఎక్స్ రోడ్డు దగ్గర తిరుగుతున్న వంశీని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 16.5 తులాల బంగారం, 1.6 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తు విలువ 7.4 లక్షలు ఉంటుందని అంచనా.