Corona Virus: కరోనా బాధితుడి ఇంటిని శుభ్రం చేసి సీలు వేసిన బెంగళూరు అధికారులు
- అతడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌వాసుల్లో భయం
- ఐసోలేషన్ వార్డులో చేరిక
- రక్త నమూనాలు సేకరించి పుణె ల్యాబ్‌కు పంపిన వైద్యాధికారులు
బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తూ అక్కడే ఉంటున్న హైదరాబాద్ యువకుడి ఫ్లాట్‌కు అక్కడి అధికారులు సీలు వేశారు. అంతకుముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేశారు. 24 ఏళ్ల బాధిత టెకీ ఇటీవల సంస్థ తరపున దుబాయ్ వెళ్లాడు. అక్కడి కంపెనీలో హాంకాంగ్‌కు చెందిన తోటి ఉద్యోగులతో కలిసి పనిచేశాడు. అనంతరం గత 20న తిరిగి బెంగళూరుకు చేరుకున్నాడు. అతడికి కరోనా సోకినట్టు వార్తలు రావడంతో బెంగళూరు ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యాధికారులను అతడి ఫ్లాట్‌కు పంపి శుభ్రం చేయించి సీలు వేయించింది.
మరోవైపు అతడు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వారితో పాటు అతడితో కలసి పనిచేసిన వారు నగరంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛెస్ట్ డిసీజెస్‌లోని ఐసోలేషన్ వార్డులో చేరారు. వీరి నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు పరీక్షల కోసం పూణెకు పంపారు. కాగా, బాధితుడి ఫ్లాట్‌లో అతడితో కలిసి ఉన్న మరో యువకుడికి కరోనా పరీక్షల్లో నెగటివ్ అని రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధితుడు కలిసినట్టు భావిస్తున్న మొత్తం 71 మందిని గుర్తించిన అధికారులు వారికి పరీక్షలు నిర్వహించారు.