Bonda Uma: ఏపీలో అమ్ముతున్న ‘జగన్​ బ్రాండ్స్​’ అన్నీ పూర్తిగా హానికరం: బోండా ఉమ

Bonda Uma criticises about AP Government
  • మద్యంపై ఆదాయం అవసరం లేదంటూనే ధరలు పెంచారు
  • పేదల జేబులకు చిల్లు పడింది.. అనారోగ్యం పాలయ్యారు
  • ‘ఆరోగ్య శ్రీ’ కింద ఈ తరహా కేసులే అధికంగా నమోదయ్యాయి
ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న ‘జగన్ బ్రాండ్స్’ అన్నీ ఆరోగ్యానికి పూర్తిగా హానికరమని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి అవసరం లేదని చెబుతూనే, వాటి ధరలు పెంచారని విమర్శించారు. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికే కాదు, జగన్ కు, వైసీపీ నాయకులకు కూడా ఆదాయం పెరిగిందని ఆరోపించారు. పేదోడు, కార్మికుల జేబులకు చిల్లు పడిందని, వారు అనారోగ్యం పాలయ్యారని, ‘ఆరోగ్య శ్రీ’ కింద నమోదైన వాటిలో ఈ తరహా కేసులే అధికంగా ఉన్నాయని విమర్శించారు.

వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలే తప్ప, ‘J-ట్యాక్స్’ కోసం పేదల ఉసురు తీయొద్దని సూచించారు. కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం ఉపయోగించుకుందని, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం స్పందించి సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆరోగ్యానికి హాని చేయని మద్యం బ్రాండ్స్ ను ప్రవేశపెట్టాలని సూచించారు.
Bonda Uma
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
Liquor

More Telugu News