Jammu And Kashmir: దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి డబ్బు పంపిన జగిత్యాల వాసి... అరెస్ట్ చేసిన కశ్మీర్ పోలీసులు
- కశ్మీర్ లో ఓ పోలీస్ ఠాణాపై దాడి చేసిన రాకేశ్
- రాకేశ్ పై దేశద్రోహం కింద కేసు
- రాకేశ్ కు గూగుల్ పే ద్వారా రూ.5 వేలు పంపిన లింగన్న
తెలంగాణకు చెందిన ఓ యువకుడ్ని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్థాపూర్ కు చెందిన లింగన్న అనే యువకుడ్ని కశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్ లో దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన రాకేశ్ అనే వ్యక్తికి లింగన్న ఆన్ లైన్ లో డబ్బులు పంపినట్టు పోలీసులు చెబుతున్నారు. దుబాయ్ లో ఉండే స్నేహితుడు చెప్పడంతో లింగన్న గూగుల్ పే యాప్ ద్వారా కశ్మీర్ లోని రాకేశ్ కు రూ.5 వేలు పంపాడని పోలీసులు వెల్లడించారు. రాకేశ్ ఇటీవల జమ్మూకశ్మీర్ లోని ఓ పోలీస్ ఠాణాపై దాడి చేసిన కేసులో నిందితుడు. అతడి బ్యాంకు ఖాతాల పరిశీలనలో లింగన్న డబ్బు పంపిన వ్యవహారం వెల్లడైంది. దాంతో జమ్మూకశ్మీర్ నుంచి ప్రత్యేక పోలీసు బృందం తెలంగాణ వచ్చింది. లింగన్నను అరెస్ట్ చేసిన పోలీసులు మల్లాపూర్ పీఎస్ కు తరలించి విచారిస్తున్నారు.