Narendra Modi: మోదీ నిర్ణయం సోషల్ మీడియాపై నిషేధానికి తొలి అడుగు: శశిథరూర్
- సోషల్ మీడియాను వీడాలనుకుంటున్నానని మోదీ ప్రకటన
- జరుగుతున్న పరిణామాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకేనన్న అధిర్ రంజన్ చౌధురి
- భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై పెద్ద దాడి అన్న సుధీంద్ర కులకర్ణి
వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాను వీడాలనుకుంటున్నానని ప్రధాని మోదీ ప్రకటించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాను వీడొద్దని ఎంతో మంది మోదీకి విన్నవిస్తున్నారు. మరోవైపు, మోదీ ప్రకటనపై పలువురు రాజకీయ ప్రముఖులు అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించే దిశగా వేస్తున్న తొలి అడుగే మోదీ ప్రకటన అని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ఆరోపించారు. మోదీ ప్రకటన దేశ వ్యాప్తంగా ఆందోళనను రేకెత్తిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. సోషల్ మీడియాపై నిషేధం విధించేందుకు తొలి చర్యగానే దీన్ని తాను భావిస్తున్నానని చెప్పారు. మంచితో పాటు, ఉపయోగకరమైన సందేశాలను పంచుకునేందుకు సామాజిక మాధ్యమాలు ఉపయోగపడతాయనే విషయం ప్రధానికి కూడా తెలుసని అన్నారు.
లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ, దేశంలో జరుగుతున్న పరిణామాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సోషల్ మీడియాను మోదీ వీడుతున్నారని విమర్శించారు.
దివంగత ప్రధాని వాజ్ పేయి సహాయకుడు, రాజకీయ విమర్శకుడు అయిన సుధీంద్ర కులకర్ణి స్పందిస్తూ... భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, కమ్యూనికేషన్ పై ఇదొక పెద్ద దాడిగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంపై కూడా త్వరలోనే ఈ తరహా దాడి జరగవచ్చని చెప్పారు. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.