Corona Virus: అమెరికాలో కరోనా కలకలం.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో 91 మందికి సోకిన కరోనా వైరస్
- వేసవి లేదా వర్షాకాలం ఆరంభం నాటికి చికిత్స అందుబాటులోకి వస్తుందన్న ఉపాధ్యక్షుడు
- వ్యాక్సిన్ కోసం ఏడాది చివరి వరకు వేచి చూడాల్సిందేనని వ్యాఖ్య
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. మృతులందరూ వాషింగ్టన్ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం. అమెరికా వ్యాప్తంగా మొత్తం 91 మందికి ఈ మహమ్మారి సోకింది. ఈ వివరాలను అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వెల్లడించారు. వీరిలో 48 మంది విదేశాల నుంచి తిరిగొచ్చారని... మిగిలిన వారికి అమెరికాలోనే వైరస్ సోకిందని తెలిపారు.
వేసవి లేదా వర్షాకాలం ఆరంభం నాటికి కరోనా వైరస్ కు చికిత్స అందుబాటులోకి వస్తుందని మైక్ పెన్స్ చెప్పారు. అమెరికాలో వేసవి జూన్ లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే పలు రకాల ఔషధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారని వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం మాత్రం ఈ ఏడాది చివరి వరకు వేచి చూడాల్సిందేనని చెప్పారు. గత శనివారం కరోనా వైరస్ కు సంబంధించి తొలి మరణం సంభవించింది.