Bontu Rammohan: దివ్యాంగులు, వృద్ధులకు చేరువ చేసేందుకు ‘మొబైల్ అన్నపూర్ణ’: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్
- కంటోన్మెంట్ కు కూడా అన్నపూర్ణ పథకాన్ని విస్తరించాం
- హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ శ్రద్ధ వల్లే నాణ్యమైన భోజనం
- విదేశీయులు కూడా ఈ పథకంపై ప్రశంసలు కురిపిస్తున్నారు
అన్నపూర్ణ భోజన పథకం ప్రభుత్వానికి తృప్తిని ఇచ్చిన పథకమని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమీర్ పేట్ లో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ, దివ్యాంగులు, వృద్ధులకు చేరువ చేసేందుకు మొబైల్ అన్నపూర్ణ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కంటోన్మెంట్ కు కూడా ఈ పథకాన్ని విస్తరించినట్లు తెలిపారు. ‘అన్నపూర్ణ’ను చాలా రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకొని ఆయా రాష్ట్రాలలో ప్రవేశపెట్టినప్పటికీ సక్రమంగా అమలు కావడంలేదని అన్నారు. హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ చూపించే శ్రద్ధ వలన పేదలకు నాణ్యమైన భోజనంతో పాటు అందరికీ గుర్తింపు లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. నగరానికి వచ్చే ప్రయాణికులు, పేషెంట్ల సహాయకులు, ఉద్యోగార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, చిరుద్యోగులు, నిరుపేదలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఈ పథకంపై విదేశీయులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారని కొనియాడారు.
రాష్ట్రంలోని 176 కేంద్రాలకు అన్నపూర్ణ విస్తరించింది: సత్యగౌరచంద్రదాసహరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యగౌరచంద్రదాస మాట్లాడుతూ, అన్నపూర్ణ పథకం రాష్ట్రంలోని 176 కేంద్రాలకు విస్తరించిందని చెప్పారు. పేదల ఆకలిని తీరుస్తున్న ఈ కార్యక్రమానికి ‘అన్నపూర్ణ పథకం’ అని నాడు కేటీఆర్ నామకరణం చేశారని గుర్తుచేశారు.