T20 World Cup: మహిళల టీ20: సెమీస్ లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా
- చివరి లీగ్ మ్యాచ్‌లో కివీస్‌పై 4 పరుగుల తేడాతో గెలుపు
- మెరిసిన మూనీ, బౌలర్లు
- మహిళల టీ20 వరల్డ్ కప్
మహిళల టీ20 వరల్డ్ కప్ లో అత్యధికంగా నాలుగు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మరో టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. సొంతగడ్డపై జరుగుతున్న తాజా టోర్నీలో ఆసీస్ అమ్మాయిలు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. సోమవారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో ఆ జట్టు నాలుగు పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఉత్కంఠ నడుమ విజయం సాధించింది.
గెలిచిన జట్టు సెమీస్‌కు అర్హత సాధించే ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేసి కొద్దిలో విజయం చేజార్చుకుంది.
కాటే మార్టిన్ (18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37), సోఫీ డివైన్ (31), మాడీ గ్రీన్ (28) రాణించడంతో ఓ దశలో 108/3తో ఈజీగా గెలిచేలా కనిపించిన కివీస్ చివర్లో తడబడింది. ఆసీస్ బౌలర్లు జార్జియా వారెహమ్ (3/17), మేగన్ షుట్ (3/28) వరుస క్రమంలో వికెట్లు తీసి ఆ జట్టును కట్టడి చేశారు.దాంతో, గ్రూప్‌లో మూడు విజయాలు, ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఆసీస్ సెమీస్‌లో అడుగుపెట్టింది. గ్రూప్ టాపర్‌గా భారత్ అందరికంటే ముందుగానే సెమీస్ బెర్తు దక్కించుకుంది.