370 Article: 370 రద్దు విచారణకు ఇప్పుడున్న ధర్మాసనం చాలు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- విస్తృత ధర్మాసనం అవసరం లేదు
- పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ సంస్థ పిటిషన్
- ప్రస్తుతం విచారణ జరుపుతున్న ఎన్.వి.రమణ బెంచ్
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ప్రస్తుతం ఉన్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం సరిపోతుందని, ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ రద్దును సవాల్ చేస్తూ పలు సంస్థలు, వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని విచారించేందుకు జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది.
అయితే, విచారణను ఏడుగురు సభ్యులున్న విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అధికరణకు సంబంధించి 1959లో ప్రేమ్ నాథ్ వెర్సస్ జమ్మూ కశ్మీర్, 1970లో సంపత్ ప్రకాష్ వెర్సస్ జమ్మూ కశ్మీర్ కేసుల్లో ఎపెక్స్ కోర్టు ఇచ్చిన తీర్పులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి, తాజా పిటిషన్ల విచారణకు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఈ సంస్థ కోరింది.
ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా.. ఆ రెండు కేసులు వేర్వేరు సందర్బాలకు సంబంధించినవని, వాటితో వీటిని పోల్చడం సరికాదని, అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న ధర్మాసనమే ఈ పిటిషన్లను విచారించాలని అటార్నీ జనరల్ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఏజీ వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.