Team New Zealand: ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ లో భారత్ కు తొలి సిరీస్ ఓటమి... వైట్ వాష్ చేసిన న్యూజిలాండ్!
- న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో మ్యాచ్
- 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్
- రెండు మ్యాచ్ లనూ కోల్పోయిన భారత్
ఐసీసీ నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పోటీల్లో భారత్ కు తొలి సీరీస్ ఓటమి ఎదురైంది. క్రైస్ట్ చర్చ్ లో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత్ ఘోరంగా ఓటమి పాలైంది. మరో రెండు రోజుల ఆట మిగిలుండగానే, మ్యాచ్ తో పాటు, సీరీస్ నూ న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.
క్రైస్ట్ చర్చ్ లో జరిగిన రెండో మ్యాచ్ లో 132 పరుగుల రెండో ఇన్నింగ్స్ లక్ష్యంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు, 3 వికెట్లు మాత్రమే కోల్పోయి, విజయాన్ని సాధించింది. తమ జట్టు విజయంలో ఓపెనర్లు లాథమ్, బ్లండెల్ కీలక పాత్రను పోషించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 103 పరుగులు జోడించడంతో న్యూజిలాండ్ విజయం ఖాయమైంది.
కెప్టెన్ విలియమ్సన్ మరోసారి పేలవమైన ప్రదర్శనతో 5 పరుగులకే అవుట్ అయినప్పటికీ, ఆ తరువాత వచ్చిన లేటర్, నికోలస్ లు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగులు చేయగా, దానికి బదులుగా న్యూజిలాండ్ జట్టు 235 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో 7 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత జట్టులో ఎవరూ నిలదొక్కుకుని భారీ స్కోర్ సాధించకపోవడంతో 124 పరుగులకే ఆలౌట్ అయింది. 132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్, దాన్ని సునాయాసంగా అధిగమించింది. దీంతో టెస్ట్ చాంపియన్ షిప్ పోటీల్లో ఇండియాకు తొలి సీరీస్ ఓటమి ఎదురైంది.
కాగా, ఈ సీరీస్ లో వైట్ వాష్ ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, భారత జట్టు టెస్ట్ చాంపియన్ షిప్ సాధించేందుకు వచ్చిన నష్టమేమీ లేదు. ఇప్పటివరకూ 7 విజయాలు, 2 పరాజయాలతో ఇండియా మిగతా జట్ల కన్నా ముందుంది. తదుపరి ఆడే సీరీస్ లలో ఇండియా సత్తా చాటితే టెస్ట్ చాంపియన్ షిప్ ను గెలుచుకోవచ్చని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.