Marriage: 'కట్నంగా ఉచిత వైద్యం'... సబ్ కలెక్టర్ షరతుకు లేడీ డాక్టర్ అంగీకారం!
- తమిళనాడులో ఇద్దరు విద్యావంతుల వివాహం
- షరతులకు అంగీకరించి, ఘనంగా పెళ్లి జరిపించిన పెద్దలు
- ప్రశంసలు కురిపిస్తున్న ప్రముఖులు
ఒకరు ఐఏఎస్ అధికారి. సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి పెద్దలు ఓ డాక్టర్ ను వధువుగా నిశ్చయించారు. ఇద్దరూ విద్యావంతులే. కట్నకానుకల ప్రస్తావన వచ్చే సరికి సదరు అధికారి కోరిక విని ఆమెకు తొలుత ఆశ్చర్యం కలిగినా, వెంటనే తేరుకుని అంగీకరించింది. అంతటి ఆదర్శ భావాలున్న వ్యక్తి తనకు భర్తగా లభించడం అదృష్టమని అనుకుంటూ సంతోషంతో వివాహానికి అంగీకరించింది. ఆపై... వారి పెళ్లి ఘనంగా జరిగింది.
వరుడి పేరు ప్రభాకరన్, వధువు పేరు డాక్టర్ కృష్ణ భారతి. ఇంతకీ ఈ సబ్ కలెక్టర్ వరుడు ఏం అడిగారో తెలుసా? వారంలో రెండు రోజుల పాటు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని, అదే తనకిచ్చే కట్నమని చెప్పాడు. అది కూడా తన స్వగ్రామమైన ఒట్టంకాడు, దాని పరిసర గ్రామాల్లోనే చేయాలని సూచించాడు. దీనికి ఆమె, ఆమె తల్లిదండ్రులూ అంగీకరించారు.
ప్రభాకరన్ తల్లిదండ్రులు కూలీలు కాగా, తన ప్రతిభతో తొలుత రైల్వే శాఖలో ఉద్యోగం సాధించిన ఆయన, ఆపై పట్టుదల చూపి ఐఏఎస్ సాధించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరుతో పలు రకాల సేవలనూ అందిస్తున్నారు. వీరి ఆదర్శ వివాహానికి ఇప్పుడు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.