Bill Gates: కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో చెప్పిన బిల్ గేట్స్
- అనేక దేశాలపై కరోనా వైరస్ పంజా
- ఇలాంటివి శతాబ్దానికి ఒకసారి వస్తుంటాయన్న గేట్స్
- ప్రస్తుతం ప్రజలను కాపాడుకోవాలని పిలుపు
చైనా, ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్-19) అనేక దేశాలకు విస్తరిస్తోంది. దీనిపై అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. కరోనా తరహా వ్యాధులు శతాబ్దానికి ఒకసారి మాత్రమే సంభవిస్తుంటాయని, అయితే ఈ వైరస్ మానవాళి మనుగడకే ముప్పులా పరిణమిస్తుందని తాను భావించడంలేదని తెలిపారు. ప్రస్తుతం దీన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు. రెండు అంశాల ప్రాతిపదికన కరోనాను ఎదుర్కోవాలని తెలిపారు. సమస్యను తక్షణమే పరిష్కరించడం మొదటిదైతే, భవిష్యత్తులో మళ్లీ రాకుండా చూడడం రెండోదని అన్నారు. ప్రస్తుతం మొదటి అంశమే కీలకమని, ముందు ప్రజలను రక్షించుకోవాల్సి ఉందని గేట్స్ అభిప్రాయపడ్డారు. రెండో అంశంపై దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వాలు, ఆరోగ్య వ్యవస్థలు సమర్థంగా చర్యలు తీసుకుని వైరస్ వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. పేద, మధ్య తరహా దేశాలకు సంపన్న దేశాలు సాయం చేయాల్సిన తరుణం ఇదేనని, ధనిక దేశాల్లో ఇలాంటి వైరస్ పర్యవసానాలను ఎదుర్కొనే బలమైన వ్యవస్థలు ఉంటాయి కాబట్టి, పేద దేశాలకు కూడా చేయూతనివ్వాలని హితవు పలికారు. మొదట కొవిడ్-19కి వ్యాక్సిన్ ను కనుగొంటే, వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. వ్యాక్సిన్ తయారీ విధానాల్లో కొత్త పోకడలు అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఫ్లూ మహమ్మారిని మించిన తీవ్రతతో ప్రాణాంతక వైరస్ ఎప్పుడైనా దాడి చేయొచ్చని అనేక దశాబ్దాలుగా హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయని, అలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కీలక వనరులు సమకూర్చిందని ఆయన వెల్లడించారు.