Donald Trump: ఇండియా వెళ్లొచ్చానుగా... ఇక ఎక్కడికి వెళ్లినా ఎక్సయిట్ అవను: డొనాల్డ్ ట్రంప్!
- మొతేరా సభకు లక్ష మందికి పైగా హాజరు
- నరేంద్ర మోదీ ఓ గొప్ప నేత
- సౌత్ కరోలినా ర్యాలీలో ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోసారి తన భారత్ పర్యటనను గుర్తు చేసుకుంటూ, నరేంద్ర మోదీపై పొగడ్తలు కురిపించారు. భారతీయులు ఎంతో అభిమానించే ఓ గొప్ప వ్యక్తి మోదీ అని అన్నారు. శనివారం నాడు సౌత్ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన, భారత పర్యటన తనకు ఎన్నో అనుభూతులను మిగిల్చిందని అన్నారు.
దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు హాజరైన మొతేరా స్టేడియం సభను గురించి ప్రస్తావించారు. "భారత ప్రజలు ప్రేమించే గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీతో కలిసి నేను ఓ అద్భుతాన్ని చూశాను. అదే ఇక్కడ సమస్యగా మారింది. ఇక్కడి సభకు ఎంతో మంది వచ్చారు. సాధారణంగా నేను నా ప్రసంగాల్లో వచ్చిన ప్రజల గురించి మాట్లాడతాను. కానీ, ఇంకెవరి సభకూ రానంత మంది ఇండియాలో నా సభకు వచ్చారు. నా సభలకు 60 వేల మంది వరకూ హాజరైన సందర్భాలున్నాయి. ఇండియా సభను చూసిన తరువాత వచ్చిన క్రౌడ్ గురించి ఇక ఎక్సయిట్ అవ్వను. ఆ దేశ ప్రజలు ఎంతో ప్రేమను చూపించారు. వారికి ఓ గ్రేట్ లీడర్ ఉన్నారు. అహ్మదాబాద్ ర్యాలీ ఎంతో విజయవంతమైంది" అని అన్నారు.
కాగా, గత వారం ప్రారంభంలో ట్రంప్, తన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు కుష్ నర్ తదితరులతో రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. 36 గంటల పాటు సాగిన వీరి పర్యటనలో అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీ ప్రాంతాల్లో వీరు పర్యటించారు.