Visakhapatnam District: అందాల అరకు రారమ్మంటోంది... నేటి నుంచి రెండు రోజులపాటు ఉత్సవాలు
- ఎన్టీఆర్ క్రీడా మైదానం వేదిక
- ఉదయం 10.30 గంటలకు లాంఛనంగా ప్రారంభం
- గిరిజన సంస్కృతీ సంప్రదాయాల కలబోత
ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరైన ఆంధ్రా ఊటీ అరకు ఉత్సవాలు ఈరోజు ప్రారంభంకానున్నాయ. విశాఖ జిల్లా కేంద్రానికి 117 కిలోమీటర్ల దూరంలో వున్న అరకులోయలోని ఎన్టీఆర్ క్రీడామైదానంలో రెండురోజులపాటు జరిగే ఉత్సవాల కోసం జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గిరిజనుల ఆచార, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే ప్రధాన లక్ష్యంతో ఉత్సవాల నిర్వహణకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శ్రీకారం చుట్టగా ప్రస్తుత ప్రభుత్వం వాటిని కొనసాగిస్తోంది.
ఏజెన్సీ అందాలు వర్ణింపతరం కాదు. పరుచుకునే పచ్చదనం, జలపాతాల గలగలలు, కొండలను తొలిచి ఏర్పాటుచేసే దారుల్లో సాగే ప్రయాణం, కమ్మని సువాసనలు పంచే కాఫీ తోటలు, గిరిజన మ్యూజియం, బొర్రాగుహలు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు విశాఖ ఏజెన్సీ సొంతం. శీతాకాలంలో మైనస్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏజెన్సీలోని లంబసింగి ఆంధ్రా కశ్మీర్‌గా పేరు సాధిస్తోంది.
ఇంతటి ప్రకృతి సోయగం సొంతం కాబట్టే ఏటా లక్షలాది మంది సందర్శకులు విశాఖ ఏజెన్సీని సందర్శిస్తుంటారు. పర్యాటకులు గిరిజనుల సంస్కృతిని పరిచయం చేయడం, వారి అటవీ ఉత్పత్తులు, హస్తకళలకు ప్రాచుర్యంతోపాటు మార్కెట్ ను కల్పించే లక్ష్యంతో ఏటా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ రోజు ఉదయం 10.30 గంటలకు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం గిరిజన సంప్రదాయ క్రీడాపోటీలు జరగనున్నాయి. సాయంత్రం 5.20 గంటలకు గిరిజన సంప్రదాయ నృత్యం థింసా, 6.20 గంటలకు లంబాడా నృత్యం, 6.50 గంటలకు బొండా నృత్యం తొలిరోజు ఆకర్షణలు. వీటికితోడు శివారెడ్డి మిమిక్రీ, మ్యూజికల్ బ్యాండ్, సంగీత విభావరి జరగనున్నాయి.
రెండోరోజైన రేపు సాయంత్రం 5 గంటలకు ఇతర రాష్ట్రాల గిరిజన కళాకారుల నృత్యోత్సవం జరగనుంది. అనంతరం స్థానిక గిరిజనుల కొమ్మకోయ, సవర తదితర సంప్రదాయ నృత్య ప్రదర్శనలుంటాయి. రాత్రికి తెలంగాణ గాయని మంగ్లీ, అనుదీప్ల సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణ కానుంది.