Wanaparthy District: జీలకర్ర, బెల్లం పెట్టడానికి రెడీ అయిన వరుడు.. ఆపండి అంటూ వధువు కేక.. ఆగిన పెళ్లి!

Marriage stopped in Wanaparthy Telangana

  • వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఘటన
  • ఈ ఘటనతో షాకైన ఇరు కుటుంబాల పెద్దలు
  • పెళ్లి కొచ్చిన యువకుడిపై దాడి

సినిమాల్లోని పెళ్లి సీన్‌ను తలపించే ఘటన ఒకటి తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. వధువు తలపై వరుడు జిలకర్ర, బెల్లం పెట్టేందుకు రెడీ అవుతుండగా ‘ఆపండి’ అంటూ వధువు పెద్దగా కేకవేసి పక్కకు తప్పుకుంది. దీంతో పెళ్లి కొచ్చిన అతిథులు, ఇరు కుటుంబాల పెద్దలు షాకయ్యారు.

గ్రామానికి చెందిన వధువు కుటుంబం కొన్నాళ్ల క్రితం మహారాష్ట్ర వెళ్లి షోలాపూర్‌లో స్థిరపడింది. స్వగ్రామానికి చెందిన అబ్బాయితో పెద్దలు ఆమెకు పెళ్లి కుదిర్చారు. నిన్న ఉదయం 8:10 గంటలకు ముహూర్తం కాగా, ఇరు కుటుంబాల వారు ఉదయాన్నే పెళ్లి మండపానికి చేరుకుని ఏర్పాట్లు పూర్తిచేశారు. వధూవరులిద్దరూ పీటలపై కూర్చున్నారు. పురోహితుడు వేదమంత్రాలు చదువుతూ పెళ్లి తంతు పూర్తి చేస్తున్నాడు.

ముహూర్తం రానే వచ్చింది. వధువు తలపై జీలకర్ర, బెల్లం పెట్టాల్సిందిగా వరుడిని పురోహితుడు కోరాడు. అతడు చేయి పైకెత్తాడు. అంతే.. వధువు ఒక్కసారిగా ‘ఆపండి’ అని కేకపెట్టింది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ పెళ్లి పీటల నుంచి పక్కకు తప్పుకుంది. అప్పటి వరకు మేళతాళాలతో సందడిగా కనిపించిన మండపం కాస్తా.. కాసేపు నిశ్శబ్దంగా మారిపోయింది. ఏం జరిగిందో అర్థంకాక పురోహితుడు, ఇరు కుటుంబాల పెద్దలు, పెళ్లికొచ్చిన అతిథులు షాకయ్యారు.

షోలాపూర్ నుంచి వచ్చిన స్నేహితుడిని చూడగానే వధువు ఒక్కసారిగా తన మనసు మార్చుకుంది. పెళ్లి ఇష్టం లేదని పీటల పైనుంచి తప్పుకుంది. ఈ ఘటనతో నివ్వెరపోయిన ఇరు కుటుంబాల వారు తేరుకుని పెళ్లికొచ్చిన వధువు స్నేహితుడిపై దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకున్న యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

Wanaparthy District
Kothakota
Marriage
Telangana
  • Loading...

More Telugu News