Hyderabad: వేసవికి ముందు... తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన మబ్బులు!
- అల్పపీడన ద్రోణి ప్రభావం
- హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో చిరు జల్లులకు అవకాశం
- అంచనా వేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ
శీతాకాలం వెళ్లిపోయి, వేసవి కాలం రాబోతున్న వేళ, అల్పపీడన ద్రోణి ప్రభావంతో, తెలుగు రాష్ట్రాల్లో... ముఖ్యంగా తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలముకున్నాయి. హైదరాబాద్ తో పాటు దక్షిణ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేడు చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. ఉపరితల ద్రోణి ప్రభావం అధికంగా ఉండటంతోనే మబ్బులు కమ్మాయని, శనివారం సాయంత్రానికి వీటి ప్రభావం తగ్గుతుందని ఓ అధికారి వెల్లడించారు.