Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో కోరుకున్నదే జరిగింది: పవన్ కల్యాణ్
- సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగింత
- సీఎం జగన్ నిర్ణయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానన్న పవన్
- సుగాలి ప్రీతి కుటుంబానికి సాంత్వన కలుగుతుందని వ్యాఖ్యలు
కర్నూలు బాలిక సుగాలి ప్రీతి హత్యాచార కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడడం పట్ల జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కొంతకాలంగా సుగాలి ప్రీతి వ్యవహారాన్ని పవన్ అనేక వేదికలపై లేవనెత్తుతున్నారు. తాజా పరిణామం నేపథ్యంలో, కోరుకున్నదే జరిగిందని పేర్కొన్నారు.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందిస్తున్నానని తెలిపారు. తమ బిడ్డకు జరిగిన ఘోరం పట్ల సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అనుభవించిన కష్టం పగవాడికి కూడా రాకూడదని పవన్ అభిప్రాయపడ్డారు. మంగళగిరిలో ఉన్న తనను కలిసేందుకు సుగాలి ప్రీతి తల్లి చక్రాల కుర్చీలో వచ్చినప్పుడు ఎంతో కదిలిపోయానని గుర్తుచేసుకున్నారు. ఇన్నాళ్లకు ఆ కుటుంబానికి సాంత్వన చేకూరినట్టుగా భావిస్తున్నానని వివరించారు.