Taapsee Pannu: తాప్సీపై నెటిజన్ల ఫైర్.. 'తప్పడ్'ను బాయ్‌కాట్ చేయాలని పిలుపు.. స్పందించిన హీరోయిన్!
- సీసీఏ వ్యతిరేక నిరసనలకు మద్దతు తెలిపిన హీరోయిన్
- ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ తప్పడ్'
- నటుల వ్యక్తిగత అభిప్రాయాల ప్రభావం సినిమాపై పడదన్న తాప్సి
- నటుల కంటే సినిమా గొప్పదని వ్యాఖ్య
హీరోయిన్ తాప్సీ నటించిన బాలీవుడ్ సినిమా 'తప్పడ్' ఈ రోజు విడుదలైన నేపథ్యంలో 'బాయ్‌కాట్ తప్పడ్' అనే హ్యాష్‌ట్యాగ్‌లో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలుపుతున్న వారికి ఆమె మద్దతు తెలపడంతో ఆమెకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతోంది.
దీనిపై తాప్సి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్పందించింది. 'నటుల వ్యక్తిగత అభిప్రాయాల ప్రభావం సినిమాలపై పడదని నేను భావిస్తున్నాను. బాయ్‌కాట్ తప్పడ్ ప్రభావం కూడా ఈ సినిమాపై పడదని అనుకుంటున్నాను. 1000-2000 ట్వీట్లు చేస్తే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వస్తుంది. ఈ ట్వీట్లు నిజంగానే సినిమాపై ప్రభావం చూపెడుతాయా? చూపెడుతాయని నేను మాత్రం అనుకోవట్లేదు' అని తెలిపింది.
'నాకు వ్యక్తిగతంగా సామాజిక, రాజకీయ అంశాల పట్ల చాలా మంది ప్రజల కంటే విభిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. అంత మాత్రాన ప్రజలు ఈ సినిమాకు వెళ్లి చూడరా? సినిమా కన్నా నటులు ఎప్పటికీ గొప్పవారు కాదు. సినిమా కోసం వందలాది మంది పని చేస్తారు' అని తెలిపింది.
'నటుల వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా వారి సినిమాలు చూడాలా? వద్దా? అన్న విషయంపై నిర్ణయాలు తీసుకోవడం తెలివితక్కువ తనమే అవుతుంది' అని తాప్సి చెప్పింది. కాగా, జేఎన్యూ విద్యార్థులకు మద్దతుగా ముంబైలోని కార్టర్ రోడ్‌లో జరిగిన నిరసనలోనూ తాప్సీ పాల్గొంది.
సీఏఏపై ఆమె తెలిపిన అభిప్రాయం పట్ల కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె... అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తాజాగా తప్పడ్ సినిమాలో నటించింది. తెలుగులో ఆమె ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్‌ఫెక్ట్, వీరా, గుండెల్లో గోదారి వంటి చిత్రాల్లో నటించింది. ఆమెకు బాలీవుడ్‌లోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నటించిన ‘పింక్’ సినిమాతో అక్కడి మంచి గుర్తింపు తెచ్చుకుంది.