Kapil Dev: టీ-20 వరల్డ్ కప్ లో ధోనీ ఆడాలంటే... కపిల్ దేవ్ సలహా!
- వరల్డ్ కప్ తరువాత బ్యాట్ పట్టని ధోనీ
- మరిన్ని మ్యాచ్ లు ఆడాల్సిన అవసరం ఉంది
- ధోనీని టీ-20లో చూడాలని అనుకుంటున్నా
- జట్టు మేనేజ్ మెంట్ దే తుది నిర్ణయమన్న కపిల్
ఈ వేసవిలో జరిగే ఐపీఎల్ సీజన్ తరువాత వచ్చే అతిపెద్ద టీ-20 పోటీలంటే, వరల్డ్ కప్ అనే చెప్పాలి. ఈ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ ఆడాలంటే, ఈలోగా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ లను ఆడుతూ, తన సత్తా చాటాల్సిన అవసరం ధోనీకి ఎంతైనా ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. హెచ్సీఎల్ గ్రాంట్ ఈవెంట్ ఎడిషన్ లో పాల్గొన్న కపిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం ఐపీఎల్ ఆడటంలో పెద్దగా విశేషం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.
ధోనీ అంటే తనకెంతో గౌరవమని, దేశం గర్వించే ఆటగాడు అతనని, ఇప్పటికే ధోనీ దేశం కోసం చాలా చేశాడని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. అతన్ని వరల్డ్ కప్ లో చూడాలని కోరుకుంటున్నానని, అయితే, ఓ క్రికెటర్ గా ఆలోచిస్తే మాత్రం జట్టు మేనేజ్ మెంట్ తీసుకునే నిర్ణయానికే కట్టుబడివుంటానని అన్నాడు. ప్రస్తుతం ధోనీ కెరీర్ చివరి దశలో ఉందని చెప్పక తప్పదని వ్యాఖ్యానించారు. కొత్త తరానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది తమ అభిప్రాయమని, అయితే, ఓ ధోనీ అభిమానిగా అతని ఆటను చూడాలని అనుకుంటున్నానని అన్నారు.
కాగా, గత సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ, మరోసారి బ్యాట్ పట్టలేదన్న సంగతి తెలిసిందే. ధోనీ రిటైర్ మెంట్ పై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ, అతను ఐపీఎల్ ద్వారా పునరాగమనం చేస్తాడని ఖరారైంది. మరో నెల రోజుల్లో ఈ పోటీలు ప్రారంభం కానుండగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించనున్న ధోనీ, మార్చి 2 నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నాడు.