Sudhakar Chaturvedi: జలియన్‌వాలాబాగ్ నరమేధానికి ప్రత్యక్ష సాక్షి.. స్వాతంత్ర్య సమరయోధుడు సుధాకర్ చతుర్వేది కన్నుమూత
- జలియన్‌వాలాబాగ్ అమరులకు అంతిమ సంస్కారాలు
- గాంధీ వద్ద స్టెనోగ్రాఫర్‌గా పనిచేసిన సుధాకర్
- అత్యధిక కాలం జీవించిన స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు
1919లో జలియన్‌వాలాబాగ్‌లో బ్రిటిషర్లు జరిపిన నరమేధాన్ని కళ్లారా చూసిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుధాకర్ చతుర్వేది కన్నుమూశారు. బుధవారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు జయనగరలో ఉన్న ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నిన్న మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.
గాంధేయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశంలో ఎక్కువ కాలం జీవించి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన వయసు 123 ఏళ్లు. మహాత్మాగాంధీకి స్టెనోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన, స్వాతంత్ర్య పోరాటంలో 13 ఏళ్లు జైలు జీవితం గడిపారు. జలియన్‌వాలాబాగ్ హత్యాకాండకు ప్రత్యక్ష సాక్షి అయిన సుధాకర్ చతుర్వేది.. ఆ ఘటనలో అమరులైన వారికి గాంధీజీ ఆదేశాలతో శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
1897లో జన్మించిన చతుర్వేది కన్నడ, సంస్కృత, ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్వాతంత్ర్య సంగ్రామం, గాంధీ తత్వాల గురించి పలు పుస్తకాలు రాశారు. నాలుగు వేదాల్లోనూ పట్టుసాధించి చతుర్వేది అనే బిరుదు అందుకున్నారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన సుధాకర్ ఓ బాలుడిని దత్తత తీసుకుని పెంచుకున్నారు.