Priyanka Gandhi: ఢిల్లీ హైకోర్టు జడ్జి ఆకస్మిక బదిలీపై ప్రియాంకాగాంధీ స్పందన
- జడ్జిపై కేంద్రం అధికార బలాన్ని చూపించింది
- న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టింది
- ఇదొక సిగ్గుపడాల్సిన విషయం
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.మురళీధర్ ను పంజాబ్ మరియు హర్యాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ స్పందిస్తూ, జస్టిస్ మురళీధర్ బదిలీ తమకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని అన్నారు. జస్టిస్ పై కేంద్ర ప్రభుత్వం తన అధికార బలాన్ని చూపించిందని... న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టిందని మండిపడ్డారు. జడ్జిని అర్ధరాత్రి బదిలీ చేయడం బాధాకరమని, ఇదొక సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు.
ఢిల్లీ హింసకు సంబంధించిన పిటిషన్ ను నిన్న రాత్రి జస్టిస్ మురళీధర్ తన ఇంటివద్దే విచారించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే జస్టిస్ మురళీధర్ పై బదిలీ వేటు పడింది.