#MeToo moment: అత్యాచారం కేసులో దోషిగా తేలిన హాలీవుడ్ నిర్మాత హార్వే
- మీటూ ఉద్యమానికి కారకుడైన హార్వే
- రెండు కేసుల్లో దోషిగా నిర్ధారించిన న్యూయార్క్ కోర్టు
- ఐదు నుంచి పాతికేళ్ల జైలు శిక్ష పడే అవకాశం
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన మీటూ ఉద్యమానికి కారకుడైన హాలీవుడ్ మొగల్, ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్ అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలాడు. హార్వేపై నమోదైన కేసులను విచారించిన న్యూయార్క్ సుప్రీంకోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది.
వర్థమాన నటులకు అవకాశాలు ఇచ్చే నెపంతో వారిపై లైంగిక దాడులకు పాల్పడినట్టు హార్వేపై ఆరోపణలు వచ్చాయి. అతని బాధితులంతా మీటూ హాష్ ట్యాగ్ తో ఓ ఉద్యమానికి తెరలేపిన సంగతి తెలిసిందే. తన దగ్గర ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా పని చేసిన మహిళపై అసహజ రీతిలో లైంగిక దాడి చేయడంతో పాటు 2013లో న్యూయార్క్‌లోని హోటల్లో ఓ మహిళపై హార్వే అత్యాచారం చేసినట్టు తేలింది. అయితే, ఆయనపై శిక్షను కోర్టు ఇంకా ఖరారు చేయలేదు. ఈ కేసుల్లో హార్వేపై కనీసం ఐదేళ్ల నుంచి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.