Jagan: విద్యుదుత్పత్తి సంస్థలకు సానుకూల వాతావరణం కల్పించాలన్న సీఎం జగన్

AP CM Jagan reviews state power policies

  • అమరావతిలో విద్యుత్ రంగంపై సీఎం సమీక్ష
  • ప్లాంట్లు ఏర్పాటు చేసేవారికి అనుకూల విధానం రూపొందించాలని ఆదేశం
  • విద్యుత్ రంగంలో మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఉద్ఘాటన

ఏపీ సీఎం జగన్ రాష్ట్ర విద్యుత్ రంగంపై అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎనర్జీ ఎక్స్ పోర్ట్ పాలసీ తయారుచేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అనుకూల విధానం ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్ విక్రయించే సంస్థలకు సానుకూల వాతావరణం కల్పించాలని సూచించారు.

విద్యుత్ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని సీఎం జగన్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్లాంట్లు ఏర్పాటు చేసేవారికి అనుకూల విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో, లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే అంశంపైనా చర్చ జరిగింది. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఏటా క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందని, పైగా భూమి హక్కులు కూడా వారికే ఉంటాయని తెలిపారు.

ఇక, మరో 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉందని, ఎన్టీపీసీకి భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. అంతేకాదు, 10 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణంపైనా ఈ సమీక్షలో చర్చించారు. సాధ్యమైనంత త్వరగా ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సోలార్ ప్లాంట్ నిర్మాణం విధివిధానాలపై అధికారులతో చర్చించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ కోసం ఫీడర్లు ఏర్పాటు చేయాలని, వచ్చే రెండేళ్లలో ఫీడర్ల ఆటోమేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.

Jagan
Andhra Pradesh
Amaravati
Power
Review Meeting
  • Loading...

More Telugu News